Wednesday, October 14, 2009

చిరు వర్సెస్‌ మోహన్‌ బాబు

హైదరాబాదు : తెలుగు సినిమా అగ్రనాయకులు మరోసారి మాటల తూటాలు పేల్చుకున్నారు. చిరంజీవి, మోహన్‌బాబులు ఒకరిపై ఒకరు మీడియా ముందు తిట్టుకున్నారు. ‘ఎమ్మెల్యే అంటే అర్థమేంటో అసెంబ్లీ రౌడీ సినిమా చూసి తెలుసుకో చిరంజీవీ...! డైలాగులు నేను బాగానే కొడుతాననే విషయం అందరికీ తెలుసు... అయినా ఈ విషయంలో నీకు థ్యాంక్స్‌.. సినిమాల్లో మాత్రమే నేను డైలాగులు కొడతా బయట కొట్టను ఈ విషయం తెలుసుకుంటే మంచింది... నేను ఏమన్నానో నీవు ఏమన్నావో తేల్చుకుని క్షమాపణలు చెప్పుకునేందుకు పబ్లిక్‌లోకి రా..! అంటూ చిరంజీవిపై మోహన్‌బాబు ధ్వజమెత్తారు. వరద బాధితుల సహాయార్థం ‘స్టార్‌ నైట్‌’ ప్రోగ్రాం నిర్వహించేందుకు ‘మా’ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు చిరంజీవి హాజరు కాకపోవడంతో ఈ వివాదం రగులుకుంది. నిన్న జరిగిన ‘మా’ ప్రెస్‌ మీట్‌లో మోహన్‌ బాబు మాట్లాడుతూ... మన కోసం నిరంతరం తపించే ఎంతో మంది ఆపదలో చిక్కుకున్నందుకు వారిని ఆదుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఓ మంచి కార్యక్రమానికి కొందరు తెలిసి కూడా రాకపోవడం క్షమించరాని నేరమని అన్నారు. ఇక్కడ మొదలయింది గొడవ... ఈ మాటలు మోహన్‌ బాబు తనను ఉద్దేశించి అన్నవేనని చిరంజీవి మరో ప్రెస్‌మీట్‌లో కౌంటరిచ్చారు.

ఓ మంచి పనికోసం ఏర్పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాను కచ్చితంగా హాజరవుతానని, సినీ నటులు చేపట్టే ఏ కార్యక్రమానికైనా పూర్తిస్థాయిలో సహకరిస్తానని చిరంజీవి అన్నారు. వరద బాధితుల సహాయార్థం మూవీ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాను హాజరు కాలేదని, ఇది క్షమించరాని తప్పని కొందరు మాట్లాడటం సబబు కాదని ఆయన అన్నారు. తాను ఇపుడు చేస్తున్న పని అదేనని, వరద ప్రాంతాల్లో పర్యటించి నేరుగా వరద బాధితులను కలిసి నేరుగా సహాయ చర్యలు చేపట్టానని, తనపై ఇలాంటి విమర్శలు చేయడం తప్పుకదా అని చిరు అన్నారు. ‘మా’ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తానొక్కడే గైర్హాజరు కాలేదని, ఇంకా చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమానికి రాలేదని, తానొక్కడిపైనే విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడె ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడితే బావుంటుందని చిరు మోహన్‌ బాబుకు సున్నితంగా చురకలంటించారు. దీంతో మరింత రెచ్చిపోయిన మోహన్‌బాబు తిరుపతిలో మరో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి మరింత రెచ్చిపోయారు. తిరుపతి ప్రస్‌మీట్‌లో మోహన్‌ బాబు మాటల తుటాలు ఒకసారి చూస్తే...

ఒకరు చెబితే విని తెలుసుకునేంతటి స్థితిలో తాను లేనని, ఆ అవసరం కూడా తనకు లేదని ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మాట్లాడాలో తనకు బాగా తెలుసని మోహన్‌బాబు చరంజీవిపై ఎదురుదాడి ప్రారంభించారు. ‘నేను ఏమన్నానో.. నీవు ఏమన్నావో తేల్చుకుని క్షమాపణలు చెప్పుకోవడానికి పబ్లిక్‌లోకి రా’ అంటూ చిరంజీవికి మోహన్‌బాబు సవాల్‌ విసిరారు. తాను ఎవరినీ ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎవరినైనా అనాలనుకుంటే డైరెక్టుగానే అంటానని, డొంకతిరుగుడుగా మాట్లాడే అలవాటు తనకు లేదని, తాను అంతటి పిరికి పందను కానని మోహన్‌బాబు అన్నారు. ‘మా’ కార్యక్రమం తెలిసికూడా రాని వాళ్లను క్షమించకూడదని మాత్రమే అన్నానని, ప్రజలు క్షమించరని అనలేదని మోహన్‌ బాబు అన్నారు. చిరంజీవి ఓ ఎమ్మెల్యేగా ఉన్నారు... ఎమ్మెల్యే అంటే అర్థమేమిటో అసెంబ్లీ రౌడి సినిమా చూసి తెలుసుకోవాలని మోహన్‌బాబు చిరంజీవికి సూచించారు. మన ఇంటిలో సంభవించిన విపత్తుగా భావించి వరద బాధితులకు ముందుకు రావలిసిన అవసరం ఉందని, సోదరుడు బాలకృష్ణ ఫోన్‌ చేయగానే ముంబయిలో ఉన్న తాను హుటాహుటిన వచ్చానని మోహన్‌బాబు తెలిపారు. అనారోగ్యమో.. అసందర్భమైతే తప్ప అందరూ రావలసిందేనని అన్నారు. సహాయం చేసే విషయంలో ఎవరు గొప్ప అనే విషయం పక్కన బెట్టి అందరూ సమానంగా కదలాలన్నారు.
(Source : Surya)